కోర్టుకెక్కిన తీన్మార్ మల్లన్న.. విచారణకు డుమ్మా!

హైదరాబాద్: తీన్మార్ మల్లన్నగా పాపులర్ అయిన చింతపండు నవీన్‌కుమార్‌పై కేసు నమోదైంది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల మల్లన్నకు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో తమకు లభించిన హార్డ్ డిస్కులు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో శుక్రవారం నాడు సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్రవారం విచారణకు రావలసిన మల్లన్న గైర్హాజరయ్యారు. తాను జ్వరంతో బాధ పడుతున్నానని, పరీక్ష చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పిన తీన్మార్ మల్లన్న.. విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలావుండగానే ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని, సైబర్ క్రైమ్ పోలీసులిచ్చిన నోటీసును రద్దు చేయాలని ఆయన కోర్టును కోరినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణకు హాజరవ్వాల్సిన తీన్మార్ మల్లన్న.. ఇలా కోర్టుకెక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

20:46
P. Raju
20:46

PR