నీటిపారుదల శాఖతో సీఎం సమీక్షా సమావేశం

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతున్న తరుణంలో.. నీటి పారుదలశాఖపై సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గెజిట్‌ నోటిఫికేషన్‌ సంబంధిత అంశాలపై చర్చ జరిగింది. ఈ విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై అధికారులతో సీఎం సమాలోచనలు జరిపారు. నిన్న కూడా ఈ అంశాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, అందుకు యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని బల్లగుద్ది మరీ చెప్పారు. రాష్ట్రానికి హక్కుగా కేటాయించిన న్యాయమైన నీటి వాటాలకు సంబంధించి బచావత్‌, బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పులపై సమావేశంలో చర్చించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌‌లోని అంశాలపై కూడా చర్చించారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకు ఉండే నీటి వాటా గురించి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని అధికారులకు సూచించారు. ఇవాళ మరోసారి సమావేశమై ఇవే అంశాలపై విస్తృతంగా చర్చించారు.