సీఎం కేసీఆర్‌పై మధుయాష్కీ ఫైర్.. మళ్లీ మోసాలకు తెరలేపాడంటూ..

హైదరాబాద్‌: తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచక, నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ రాక్షస పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తున్నామని మధుయాష్కీ తెలిపారు. ఇంద్రవెల్లి సభ భారీగా జరుగుతుందని చెప్పిన ఆయన.. ఈ సభకు రాజకీయాలకు అతీతంగా అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజల స్పందన చూస్తుంటే ఇంద్రవెల్లి సభకు లక్షపైగా జనం వస్తారని అనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక రాగానే కేసీఆర్ మళ్లీ మోసాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. దళిత బంధు పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి రెడీ అయ్యారని విమర్శించారు. దళిత, గిరిజన కుటుంబాలకు రూ.కోటి ఇచ్చినా తక్కువేనని మధుయాష్కీ అన్నారు. కాగా, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని లక్షమందితో నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొన్నిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.