ఖేల్‌రత్న అవార్డు పేరు మార్చడంపై కాంగ్రెస్ నేతల గరం గరం

హైదరాబాద్: క్రీడల్లో అద్భుతంగా రాణించిన వారికి ఏటా అందించే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డు పేరును ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నగా మార్చింది. ఇలా అవార్డు పేరు మార్చడం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ తప్పుబట్టారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని కొనియాడారు. గాంధీ కుటుంబంపై ఉన్న కక్షతోనే పేరు మార్చారని మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డు పేరిట కొత్త అవార్డును ప్రకటిస్తే బాగుండేదని, అంతేగానీ రాజీవ్ గాంధీ పేరును మార్చడం సరికాదని అన్నారు. ఇలా పేర్లను మార్చడం మోదీకి, ఆయన ప్రభుత్వానికి బాగా అలవాటైపోయిందని విమర్శించారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కి భారతరత్న ఇవ్వాలని వీహెచ్‌ డిమాండ్ చేశారు.

అలాగే రాజీవ్‌ ఖేల్‌రత్నను ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మార్చడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఇలా రాజీవ్ గాంధీ పేరు తొలగించడం సరికాదని, దారుణమని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇది బీజేపీ, మోదీ పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనమని అన్నారు. దేశంలో క్రీడాభివృద్ధికి రాజీవ్‌ గాంధీ చాలా కృషి చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం చిల్లర రాజకీయమని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు కొనసాగిస్తే బాగుంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.