తీన్మార్ మల్లన్న కేసులో హైడ్రామా.. అసలేం జరిగింది?

హైదరాబాద్: ప్రతిరోజూ ఉదయాన్నే అన్ని న్యూస్ పేపర్లూ ఒక తాడుకు తగిలించి, ఒక్కొక్క పేపర్లో వార్తలు చదువుతూ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ ప్రజల్లో పాపులర్ అయిన వ్యక్తి చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న. ఆయనపై ఇటీవల పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం బోడుప్పల్‌లో మల్లన్నకు చెందిన క్యూ- న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. క్యూ-న్యూస్ ఆఫీసు కంప్యూటర్లలోని హార్డ్‌ డిస్క్‌లు, ఇతర మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్లన్నపై ఓ యువతి ఫిర్యాదు చేసిందని, అందుకే కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అదేరోజు ఆయనకు పోలీసు శాఖ నుండి నోటీసులు కూడా పంపడం జరిగింది.

శుక్రవారం నాడు సైబర్‌క్రైమ్‌ పీఎస్‌లో తీన్మార్ మల్లన్న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అందరూ తీన్మార్ మల్లన్న విచారణకు వస్తాడనే అనుకున్నారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, కరోనా పరీక్ష చేయించుకోవడానికి వెళ్తున్నానని, విచారణకు హాజరు కాలేనని మల్లన్న తెలిపారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ పేరుతో తనను వేధించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఒక కేసు విచారణలో ఉండగానే మరో కేసులో విచారణకు పిలుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని మల్లన్న తన పిటీషన్‌లో కోర్టును కోరినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో తర్వాత ఏమవుతుందో అనే ఆసక్తి ప్రజల్లో పెరిగిపోతోంది. ప్రభుత్వాన్ని విమర్శించినందుకే మల్లన్నను టార్గెట్ చేశారా? లేక దీనిలో మరో కోణం ఉందా? అని చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికల కన్నా తెలంగాణలో ఇదే హాట్‌టాపిక్‌గా మారిందనడంలో అతిశయోక్తి కూడా కాదు.