చేనేతల సంక్షేమం 1200 కోట్లు.. ప్రకటించిన కేటీఆర్

హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేబినెట్ మంత్రి కేటీఆర్.. చేనేతలకు శుభవార్త చెప్పారు. చేనేతల అభివృద్ధి కోసం రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఇక నుంచి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కేటీఆర్ కోరారు. ఈరోజు పీపుల్‌ప్లాజాలో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 31 మంది ఉత్తమ చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులతో పాటు కేటీఆర్ పురస్కారాలను అందించడం జరిగింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. చేనేతలను ప్రోత్సహించేందుకే ఈ అవార్డులు అందిస్తున్నామని చెప్పారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాముల ద్వారా చేనేత వస్తువులను ప్రపంచవ్యాప్తంగా సేల్స్ చేస్తున్నామని, టెస్కో ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. కాగా, ఇటీవల జరిగిన ఒక సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. చేనేతలకు సాయం చేయడం కోసం చేనేత బీమా పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే మంత్రివర్గానికి సూచనలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.