ప్యాకెట్లో వచ్చే పాలను వేడి చేయకుండా తాగుతున్నారా?.. ఇది తెలుసుకోవాల్సిందే..

మనం ప్రతిరోజూ ఉదయాన్నే చిల్లరకొట్టుకు వెళ్లగానే కొనుగోలు చేసే వస్తువు పాల ప్యాకెట్. అయితే ఈ ప్యాకెట్లలో వచ్చే పాశ్చరైజ్డ్‌ పాలను వేడి చేయకుండా తాగడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? అనే డౌట్ కొందరికి వస్తుంది. దీనికి నిపుణులు ఏం సమాధానం చెప్తున్నారో ఒకసారి చూద్దామా..

పాలల్లో ఉండే కొలై, సాల్మొనెల్లా, లిస్టీరియా మొదలైన హానికారక సూక్ష్మజీవులను నాశనం చేయడం కోసం పాలను అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం వేడి చేస్తారు. ఆ వెంటనే చల్లార్చి ప్యాక్‌ చేసేస్తారు. వీటినే పాశ్చరైజ్డ్‌ పాలు అంటారు. ఇలా పాశ్చరైజ్‌ చేసిన పాలను నాలుగు డిగ్రీల సెల్సియస్ చల్లదనంలో ఉంచితే.. ప్యాక్‌ చేసిన సమయం నుంచి కనీసం రెండు రోజుల పాటు సురక్షితంగా ఉంటాయి. ఆ తర్వాత చెడిపోతాయి. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచి, పాశ్చరైజ్‌ చేసిన పాలను మొదటి నలభై ఎనిమిది గంటల్లో వేడి చేయకుండా వాడినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ, ప్యాకింగ్‌ చేసిన సమయం నుంచి మన ఇంటికి చేరే వరకు సుమారు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు పడుతుంది. రవాణా సమయంలో ఆ పాలు అతి చల్లని ఉష్ణోగ్రతలో ఉండవు కదా. సాధారణ గది ఉష్ణోగ్రతలోనే ఉంటాయి. కాబట్టి ఆ పాలను మళ్లీ కాచి లేదా వేడి చేసి వాడటమే మంచిదని డాక్టర్లు సలహా. కాబట్టి ఇకపై పాలప్యాకెట్ కొంటే కచ్చితంగా వేడిచేసే తాగండి.