వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరగవ్వాలి: సీఎస్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎస్‌.. అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం, కొన్ని ఆస్పత్రుల్లో అదనపు ఫ్లోర్‌ల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కొన్ని జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌లు, ఐసియూ బెడ్స్‌ను పెంచాలని చెప్పారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మళ్లీ ముమ్మరం చేయాలని సూచించిన ఆయన.. దీని కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, పబ్లిక్‌హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి, టిమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర రెడ్డి, టీఎస్‌ఐఐసి చీఫ్‌ ఇంజనీర్‌ శ్యామ్‌సుందర్‌, టీ ఎస్‌ఎంఐడిసి సీఈ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది.