బీజేపీ నేతపై ఫిర్యాదు చేసిన మంత్రి గంగుల

కరీంనగర్‌: టీఆర్ఎస్ పార్టీ మంత్రి గంగుల కమలాకర్.. బీజేపీ సీనియర్ నేతపై ఫిర్యాదు చేశారు. తనకు సంబంధంలేని వ్యవహారంలో తన పరువుతీసే విధంగా సామాజిక మాధ్యమాల్లో, పత్రికలు, ఛానల్స్‌లో ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అసత్య ప్రచారం వల్ల తన పరువు పోతోందని అన్నారు. బీజేపీ కరీంనగర్‌ మాజీ అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి ఈ పనులు చేసినట్లు రాష్ట్ర పౌరసరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి బేతి మహేందర్‌రెడ్డిపై కరీంనగర్‌ రెండో ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్‌‌లోని ఐపీసీ 153ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, గంగుల కమలాకర్‌కు చెందిన కొన్ని గ్రానైట్ కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల కేసు పడిన సంగతి తెలిసిందే. అనుమతులు ఇచ్చిన దాని కన్నా ఈ కంపెనీలు అధిక మొత్తంలో గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేసు నమోదైంది. ఇప్పుడు గంగుల కమలాకర్ పరువు తీస్తున్నట్లు బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డిపై కేసు వేయడం చర్చనీయాంశంగా మారింది.