కేటీఆర్ ఫెయిల్.. దళితులు చనిపోయినా పట్టించుకోదీ సర్కార్: రేవంత్

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసిన ఆయన.. తన బాధ్యతలు నిర్వర్తించడంలో కేటీఆర్ తీవ్రంగా ఫెయిలయ్యారని మండిపడ్డారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేటీఆర్‌ను దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతాలు చేస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీలు ఇచ్చారని మండిపడ్డ ఆయన.. ఏడేళ్లుగా హైదరాబాద్‌ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి రూ.600 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్న రేవంత్ రెడ్డి.. ఇలా వరద బాధితుల పేరుతో కుంభకోణం చేసి రూ.300 కోట్లు టీఆర్‌ఎస్‌ నేతలే దోచుకున్నారని ఆరోపించారు.

హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు తీసుకొచ్చి, పేదల కోసం పథకం తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం.. దళిత కార్మికులు చనిపోయినప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు. కనీసం మృతుల కుటుంబాలను కూడా టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇద్దరు దళితులు చనిపోతే పరామర్శించడానికి కనీసం జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా రాలేదని తప్పుబట్టారు. అంతయ్య మృతదేహం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి నష్ట పరిహారం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.