ప్లాన్ ప్రకారం రాజీనామా చేయలేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: రేపు బీఎస్పీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలే ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారం నాడు బీఎస్పీలో చేరనున్నారు. నల్గొండ సంకల్ప సభలో ఆయన బీఎస్పీ కండువా కప్పుకోబోతున్నారు. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడిగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ వార్తా సంస్థకు ఆర్ఎస్ ప్రవీణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే తెలంగాణలో 6 వేల కిలో మీటర్లు తిరిగా. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు.. ఖమ్మం నుంచి నిజామాబాద్ దాకా.. నిజామాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకూ అన్ని పట్టణాలు, గ్రామాల్లో పర్యటించా. బహుజన రాజ్యస్థాపన కోసం వీఆర్ఎస్ తీసుకున్న తర్వాతే అన్ని గ్రామాల్లో తిరిగా. ప్లాన్ చేసుకొని నేను ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. అందుకని ఇది పూర్తిగా యాధృచ్ఛికం అని కూడా అనను. సంవత్సరం, ఆరు నెలలుగా ఈ విషయమై ఆలోచిస్తున్నా.. ప్రజలకు ఒక్కశాతమైనా న్యాయం చేయాలి. పేదల కష్టాలు తెలుసుకున్నాక 100 శాతం న్యాయం చేయాలని నిర్ణయించుకున్నా. సాధ్యమైనంత వరకు నిజాయితీగా పని చేయాలనేదే నా ఆలోచన’’ అని ప్రవీణ్ కుమార్ తెలిపారు.