ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరే డేట్ ఫిక్స్.. నల్గొండలో భారీ సభకు ఏర్పాట్లు

హైదరాబాద్: 1995 ఐపీఎస్​ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయ రంగ ప్రవేశానికి అంతా సద్ధమైంది. ప్రభుత్వ గురుకులాల్లో మంచి పట్టు సాధించి, ఎవరూ ఊహించని విధంగా రాజీనామా చేసి పతాక శీర్షికల్లో నిలిచారు. గురుకులాల మాజీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ జీవితంపై కొన్ని రోజుల క్రితం క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవులకు రాజీనామా చేసినట్లు రాజీనామా చేసిన రోజున ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత ఆయన చెప్తున్న బహుజన వాదానికి అనుగుణంగానే రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలో బీఎస్పీలో చేరతారని యూపీకి చెందిన బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి స్వయంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఆయన గతంలో యూపీకి వెళ్లి మాయవతిని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందస్తు వ్యుహంలో భాగంగానే ఆయన రాజీనామా సమర్పించారని సమాచారం. అయితే ఆయన పార్టీలో ఎప్పుడు చేరతారనే విషయంపై ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రభాకర్ దీనిపై కీలక ప్రకటన చేశారు. ప్రవీణ్ కుమార్ ఈ నెల 8 తేదీన బీఎస్పీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు బీఎస్పీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. ఇందు కోసం నల్గొండలోని ఎన్‌జీ కాలేజ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్.. బీఎస్పీలో చేరుతున్నారని ప్రభాకర్ వెల్లడించారు.