చేనేతలకు సీఎం కేసీఆర్ శుభవార్త.. కేటీఆర్ కూడా..

హైదరాబాద్: జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. చేనేత రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని, బతుకమ్మ చీరలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల నేతన్నలకు చేతినిండా పని దొరుకుతోందని తెలియజేశారు. వీటితోపాటు ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. రైతు బీమా మాదిరి చేనేతలకు కూడా త్వరలో బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. దీనిపై ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖతో కూడా చర్చించామని అన్నారు.

ఈ విషయంలో కొన్ని సూచనలు ఇచ్చినట్లు కేసీఆర్ గతంలోనే వివరించారు. చేనేతలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేదని సీఎం కేసీఆర్ మరోసారి గుర్తుచేశారు. కాగా, ఈ రోజు పీపుల్‌ప్లాజాలో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 31 మంది ఉత్తమ చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులతో పాటు మరిన్ని పురస్కారాలను మున్సిపల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందించారు. అలాగే చేనేతల సంక్షేమం కోసం రూ.1200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.