కృష్ణానది బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ.. ఏపీ నీరు తరలించకుండా ఆపాలంటూ..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. నదీ బోర్డు చైర్మన్‌కు తెలంగాణ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ కుమార్‌ ఈ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలిస్తోందని, ఇలా చేయకుండా ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే నాగార్జుసాగర్‌ నీటి అవసరాలు ఉన్నాయని, వీటి కోసం ఏపీ నీరు తరలించకుండా ఆపాలని కోరారు. ఏపీ తన పరిమితికి మించి నీరు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఏపీ ఇప్పటికే 25 టీఎంసీల నీరు తరలించిందని, ఇంకా నీరు తరలించకుండా ఆపాలని లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీల నీటిని మాత్రమే ఏపీ తీసుకోవాలని, అంతకు మించి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, గడిచిన కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ నీటిని ఎక్కువగా తీసుకుంటోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.