మత్తు వదలాలంటే.. నిద్ర తప్పనిసరి!

మన జీవితంలో నిద్ర చాలా ప్రముఖమైన విషయం. నిద్రలేని రాత్రులు అడపాదడపా ఉంటే ఫర్వాలేదు కానీ.. ఈ నిద్రలేమి అలవాటు అలానే కొనసాగితే ఎంతటి విజేతలైనా సరే.. జీవితంలో విజయం సాధించలేరు. నిద్ర అనేది నిజమైన జీవితానికి సంకేతం. అందుకనీ 24 గంటలూ నిద్రపోవడం కూడా మంచిది కాదండోయ్. రోజుకు కనీసం ఏడు గంటలు నిద్రపోతే చాలు. దీని వల్ల మన మానసిక స్థితి కూడా చాలా మెరుగవుతుంది. ఆ మార్పు మీకు కనిపిస్తుంది. తక్కువగా నిద్రపోతే చాలా మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి, కోపం, ఆందోళన మన వెంటపడతాయి. నిద్రలేమితో బాధపడే వాళ్లను పడుకోమంటే ‘నిద్రరాదు ఏం చేస్తాం?’ అంటారు. అది వారికి వారే తెలియకుండా చేసుకున్న నిర్ణయం. ఆ తర్వాత క్రమంగా ఆ నిర్ణయమే అలవాటుగా మారి సమస్యలకు దారితీస్తుంది.

అప్పటి వరకూ లేని కష్టాలు ఈ అలవాటు వల్ల మొదలవుతాయి. ముఖ్యంగా ఏకాగ్రత కోల్పోతారు. చీటికిమాటికి చిరాకు. దీంతో ఏం చేసినా విజయం మాత్రం దక్కదు. మన శరీరానికి నిద్ర రీచార్జ్‌ వంటిదని గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం ఆరు, కుదిరితే ఏడు గంటలు నిద్రపోవాలని చాలామంది నిపుణులు మొత్తుకుంటున్నారు. నిద్ర సరిగ్గా ఉంటే మెదడులోని న్యూరాన్ల మధ్య కనెక్షన్‌ అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా వేగం పెరుగుతాయి. ఇలా ప్రశాంతంగా పడుకునే వాళ్లు మిగతా వారితో పోలిస్తే హుషారుగా ఉంటారని తాజాగా చేసిన అనేక పరిశోధనల్లో తేలింది. వీరు జీవితంలో మత్తుగా ఉండటం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా యువత ఏడుగంటలకు పైగా నిద్రపోవాలని నిపుణులు నొక్కి చెప్తున్నారు. ఈ సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్‌ తెరలతో స్నేహం చేసే యువతలో నిద్రలేమి సమస్య అధికంగా కనిపిస్తోంది. నిద్రపోయే ముందు కళ్లపై గ్యాడ్జెట్ల కాంతి కిరణాలు పడకపోవటం మంచిది. అందుకే వాటికి దూరంగా ఉండాలి. మరుసటి రోజు ఏమి చేయాలో ఓ లిస్ట్‌ను పేపరు మీద రాసుకుని నిద్రపోవటం చాలా ఉత్తమం.