సంక్షేమ పథకాలను స్వయం సహాయక సంఘాలు వాడుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలను సహకార సంఘాలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐకేపీ పథకం కింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు 2 వేల 32 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజిని 51 వేల 674 స్వయం సహాయక సంఘాలకు కల్పించినట్లు ఆయన చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలోని మొత్తం 54 గ్రామాల్లో 1470 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఉన్న 17వేల 255 సభ్యులకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. వీటి విలువ 29 కోట్ల 51 లక్షల 23 వేల 751 రూపాయలు ఉందని గణాంకాలు చెప్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం, స్ర్తీ నిధి పథకాల ద్వారా మహిళా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సక్రమంగా వినియోగించుకొని మహిళలు అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, డీఆర్డివో శ్రీనివాస్ కుమార్ తదితరులు కూడా పాల్గొని స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెక్కులు అందజేశారు.