కేసీఆర్‌కు కుర్రాళ్ల షాక్.. కాన్వాయ్‌కు అడ్డుపడిన ఆకతాయిలు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కొందరు ఆకతాయిలు షాకిచ్చారు. ఆయన కాన్వాయ్‌కు వాళ్లు అడ్డుపడ్డారు. కొత్త సచివాలయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించడం కోసం సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సమయంలో కేసీఆర్ కాన్వాయ్ సచివాలయం దగ్గరకు వెళ్తున్న క్రమంలో ఆకతాయిలు బైక్‌పై దూసుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా స్పీడ్‌గా వెళ్లారు. దీంతో కాన్వాయ్ ఒక్కసారిగా స్లో అయింది. అయితే ఆకతాయిల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పటిష్ట బందోబస్తులో కూడా దూసుకెళ్లడంపై పోలీసులు గుస్సా అవుతున్నారు. ఈ ఆకతాయిలపై సీరియస్ యాక్షన్‌ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ ఆకతాయిల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోలీసుల్లో ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. బందోబస్తులో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో తమపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారేమోనని అధికారులు భయపడుతున్నారు.

ఇదిలావుండగా, ఎన్టీఆర్ మార్గ్‌లో కూడా సీఎం కాన్వాయ్‌కు ఓ వ్యక్తి ఎదురెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.