తెలంగాణలో జోన్ల వారీగా కేడర్.. గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వివిధ డిపార్ట్‌మెంట్‌లలోని పోస్టులను జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఖరారుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ వల్లే ఈ ఫీట్ సాధ్యమైందని ఈ సంఘం పేర్కొంది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జోన్లు, మల్టీ జోన్ల వారీగా వివిధ విభాగాల పోస్టులను ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని తెలంగాణ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా 95 శాతం స్థానిక రిజర్వేషన్‌ ఉండేలా కృషి చేశారని గెజిటెడ్ అధికారుల సంఘం కొనియాడింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు రావడంలో సీఎం కేసీఆర్ కృషి చాలా ఉందని వారు పేర్కొన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా పోస్టులను జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా కేటాయించడం వల్ల తదుపరి వెలువడే నోటిఫికేషన్‌లలో ఉపయోగం ఉంటుందని గెజిటెడ్ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ఉద్యోగాలు తెలంగాణ వారికే దక్కుతాయని, జోన్లు, మల్టీజోన్ల కూర్పు కూడా సామాజిక, భౌగోళిక, ఆర్ధికాంశాలు దృష్టిలో పెట్టుకుని విభజించడం వల్ల ఎక్కడి వారికి వారి జోన్లలో ప్రాధాన్యత దక్కుతుందని టీజీవో అధ్యక్షురాలు మమత చెప్పారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమతతోపాటు టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎస్‌, సహదేవ్‌, కోశాధికారి రవీందర్‌కుమార్‌ తదతరులు పాల్గొన్నారు.